గోదావరిఖని : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 1న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం పిలుపునిచ్చారు.
భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు ఆగస్టు 6న ప్రారంభమైన సీపీఐ ప్రజా చైతన్య ప్రచార యాత్ర బుధవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ జనగామలో కొనసాగింది. సీపీఐ జెండా వద్ద ప్రారంభమైన ప్రచార యాత్ర యాదవ్నగర్ మీదుగా కచేరీ వరకు సాగింది. అనంతరం నిర్వహించిన సమావేశంలో తాండ్ర సదానందం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
దేశ ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్న బీజేపీ ప్రభుత్వ విధానాలను ప్రజలు వ్యతిరేకించాలని ఆయన అన్నారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలనలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజలపై భారాలు పెంచుతూ, కార్పొరేట్ సంస్థలకు అనుకూల విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు.
దేశ సంపదను కొంతమంది పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నారని సదానందం ఆరోపించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వ హయాంలో సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహంతో ఉన్నారని, రానున్న రోజుల్లో రాజకీయ మార్పు తప్పదని పేర్కొన్నారు.
రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం నుంచి తగిన సహకారం అందడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ తెలంగాణకు ఆశించిన ప్రయోజనాలు దక్కలేదని అన్నారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ, ప్రజలు ఈ విధానాలను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
ప్రజా, కార్మిక సమస్యల పరిష్కారం కోసం ప్రజలు, కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని సదానందం కోరారు. సెప్టెంబర్ 1న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు తొడుపునూరి రమేశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతం గోవర్ధన్, గోసిక మోహన్, నగర కార్యదర్శి కనకరాజు, ప్రజా సంఘాల నాయకులు కన్నం లక్ష్మీనారాయణ, తాళ్లపెల్లి మల్లయ్య, ఎజ్జ రాజయ్య, శేఖర్, మడికొండ ఓదెమ్మ, ఆసాల రమ, తిరుమల, జూల మోహన్, తాళ్లపెల్లి సురేందర్, మానస్ కుమార్, నూకల మొండి, డివిజన్ సీపీఐ నాయకులు అర్కటి శ్రీనివాస్, దోరగండ్ల మల్లయ్య, కంది సత్యనారాయణ, జనగామ బానేశ్ తదితరులు పాల్గొన్నారు.








