contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సింగరేణి ఆర్థిక లావాదేవీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: సీఐటీయూ

గోదావరిఖని : సింగరేణి సంస్థ ఆర్థిక పరిస్థితి, వార్షిక లాభాలు, సంస్థ అభివృద్ధి పేరుతో కేటాయించిన నిధులు, జరిగిన ఆర్థిక లావాదేవీలపై పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) బ్రాంచ్ సెక్రటరీ కుంట ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.

శుక్రవారం రామగుండం–2 ఏరియాలోని వకీల్‌పల్లి మైన్‌లో కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ కార్మికుల చెమటతో నిర్మితమైన ప్రభుత్వ రంగ సంస్థ అని, దాని ఆర్థిక వ్యవహారాల్లో పూర్తి పారదర్శకత ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.

గత రెండు సంవత్సరాల్లో సంస్థకు లాభాల్లో వాటా వచ్చిన సమయంలో సింగరేణి అభివృద్ధి కోసం దాదాపు రూ.6,000 కోట్లు వినియోగించేందుకు కేటాయించినట్లు పేర్కొన్నారని, ఆ నిధుల ప్రస్తుత పరిస్థితిపై యాజమాన్యం స్పష్టత ఇవ్వాలని ప్రవీణ్ కుమార్ కోరారు. ఆ నిధులు ఎక్కడ ఉన్నాయి, ఎంత మొత్తం ఖర్చు చేశారు, ఎంత మిగిలి ఉంది అనే వివరాలను కార్మికులు, ప్రజలకు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

సింగరేణి ఆర్థికంగా బలంగా ఉంటేనే కార్మికుల భద్రతకు అవసరమైన రక్షణ పరికరాలు, నాణ్యమైన పనిముట్లు, ఆధునిక యంత్రాలను సమకూర్చడం సాధ్యమవుతుందని అన్నారు. నాణ్యత లేని పరికరాలు, పాత మిషనరీతో కార్మికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టకుండా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరారు.

సంస్థ అభివృద్ధి పేరుతో తీసుకునే ప్రతి నిర్ణయం కార్మికుల భద్రత, ఉద్యోగ భద్రత, హక్కులకు అనుకూలంగా ఉండాలని ఆయన అన్నారు. సింగరేణి సంస్థను కాపాడుకోవాలంటే రాజకీయ జోక్యానికి స్వస్తి పలికి, సంస్థ ఆర్థిక వ్యవహారాలను పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.

సింగరేణి సంస్థ పరిరక్షణతో పాటు కార్మికుల హక్కుల సాధన కోసం భవిష్యత్తులో చేపట్టే నిరసనలు, పోరాట కార్యక్రమాల్లో కార్మికులందరూ ఐక్యంగా పాల్గొనాలని ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బానోత్ వినయ్, ఫిట్ సెక్రటరీ తిరుపతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంపత్, వైస్ ప్రెసిడెంట్ మంద భూమయ్య, నర్ర సాంబారావు, శ్రవణ్, రాములు, జగదీశ్, వినయ్ రాజ్ తదితరులతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :