గోదావరిఖని : రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్., మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సాయుధ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన సీపీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బందికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలు, ప్రాణ బలిదానాలు చిరస్మరణీయమని అన్నారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు ప్రజలు స్వేచ్ఛాయుతమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారని పేర్కొన్నారు.
స్వతంత్ర సమరయోధుల ఆశయాలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సీపీ పిలుపునిచ్చారు. స్వతంత్ర దినోత్సవం ప్రతి భారతీయుడికి ఎంతో ముఖ్యమైన రోజని, బ్రిటిష్ పాలన నుంచి దేశానికి స్వతంత్రం లభించిన ఈ రోజు భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వేసిన చారిత్రక ఘట్టమని తెలిపారు.
స్వతంత్రం అనంతరం ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఆధ్వర్యంలో దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా అనేక రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిందన్నారు. అభివృద్ధితో పాటు సమాజంలో సామరస్యం, ప్రజల మధ్య ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. అభివృద్ధి చెందిన తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.
ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన బాధ్యత
రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో పోలీసు శాఖ కూడా ప్రజలతో కలిసి పనిచేస్తోందని సీపీ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణతో పాటు విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవడం పోలీసుల ప్రధాన బాధ్యతలని అన్నారు.
విధుల స్వరూపం, పరిస్థితులు మారుతున్నప్పటికీ పోలీసుల లక్ష్యం మాత్రం ఒక్కటేనని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే పోలీసు శాఖలో చేరామని పేర్కొన్నారు. అదే సేవాభావం, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజల భద్రతకు, రాష్ట్ర అభివృద్ధికి పోలీసు అధికారులు, సిబ్బంది తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని సీపీ విజ్ఞప్తి చేశారు. పోలీసులతో సమన్వయంతో పనిచేస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు, సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పోలీసులు, ప్రజలు సమన్వయంతో ముందుకు సాగితే మరింత సురక్షితమైన, ప్రశాంతమైన, అభివృద్ధి చెందిన సమాజాన్ని నిర్మించగలమని అన్నారు.
ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారు ప్రశాంతమైన వాతావరణంలో జీవించేలా అన్ని విధాలా కృషి చేస్తామని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు
విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఈ సందర్భంగా సీపీ ప్రశంసాపత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ రమేష్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు, ఏఓ శ్రీనివాస్, సీఐలు, ఎస్‌ఐలు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు దామోదర్, మల్లేశం, రమేష్, సూపరింటెండెంట్లు ఇంద్రసేనారెడ్డి, మనోజ్, సందీప్, సంధ్య, సీసీ సందీప్‌తో పాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, సీపీఓ, ఏఆర్, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








