న్యూఢిల్లీ : ప్రభుత్వ వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు ప్రజాధనాన్ని మరింత సమర్థంగా వినియోగించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ వాహనాలకు అర్హులైన ప్రతి అధికారికి ఒకే ప్రభుత్వ వాహనాన్ని మాత్రమే కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం (Department of Expenditure) ‘ఒక అధికారికి–ఒకే కారు’ విధానాన్ని అమల్లోకి తెస్తూ అధికారిక మెమొరాండం జారీ చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం, ఇప్పటికే ప్రభుత్వ వాహనాన్ని వినియోగిస్తున్న ఏ అధికారి అయినా మరో మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ సంస్థ లేదా స్వయంప్రతిపత్తి సంస్థలో అదనపు బాధ్యతలు చేపట్టినా, అతనికి లేదా ఆమెకు రెండో ప్రభుత్వ వాహనాన్ని కేటాయించరాదు. అదనపు బాధ్యతల నిర్వహణకు కూడా అదే ప్రభుత్వ వాహనాన్ని వినియోగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని కేంద్ర ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలకు స్పష్టం చేసింది. దీంతో ఒకే అధికారి పేరిట ఒకటి కంటే ఎక్కువ ప్రభుత్వ వాహనాలు వినియోగించే అవకాశాలకు పూర్తిగా తెరపడనుంది.
ప్రభుత్వ వాహనాల వినియోగాన్ని మరింత క్రమబద్ధీకరించే చర్యల్లో భాగంగా మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs), స్వయంప్రతిపత్తి సంస్థలు, పాక్షిక ప్రభుత్వ సంస్థలకు చెందిన వాహనాలను కేంద్ర ప్రభుత్వ అధికారులు వినియోగించడాన్ని నిషేధించింది. అయితే, అధికారిక పర్యటనలు లేదా విధుల్లో భాగంగా అవసరమైతే మాత్రమే అలాంటి వాహనాలను వినియోగించేందుకు మినహాయింపు కల్పించింది.
ఈ చర్యల ప్రధాన ఉద్దేశం పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడం, ప్రభుత్వ ఆస్తుల వినియోగాన్ని పారదర్శకంగా మార్చడం, వనరుల వృథాను అరికట్టడం అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే వినియోగంలో లేని లేదా మిగులుగా ఉన్న ప్రభుత్వ వాహనాలను అనధికారిక అవసరాలకు ఉపయోగించకుండా సురక్షితంగా భద్రపరచాలని సంబంధిత శాఖలకు సూచించింది.
ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా సమకూరే ప్రభుత్వ నిధులను బాధ్యతాయుతంగా వినియోగించడమే ఈ నిర్ణయాల ప్రధాన లక్ష్యమని వ్యయ విభాగం పేర్కొంది. ప్రభుత్వ వాహనాల నిర్వహణలో ఆర్థిక క్రమశిక్షణను మరింత బలోపేతం చేయడం ద్వారా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు ఈ చర్యలు దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు.
కాగా, 2022 సెప్టెంబర్‌లో ప్రభుత్వ వాహనాల వినియోగంపై జారీ చేసిన సమగ్ర మార్గదర్శకాలకు కొనసాగింపుగా ఈ తాజా సవరణలు తీసుకొచ్చారు. కొత్త నిబంధనలను అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీంతో ప్రభుత్వ వాహనాల వినియోగంలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం నెలకొనే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.








