జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను రోడ్లమీద తీసుకొచ్చిందని కోరుట్ల బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎంఆర్ చెక్కుల పంపిణీలో ఆయన పాల్గొని 23 లక్షల విలువగల 76 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు, రైతు భరోసా ఎవరికి ఇస్తున్నారో తెలియడం లేదన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎత్తు పెరిగాడు తప్ప ఆలోచన పెరుగలేదని 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ మంచి నీళ్లు, కరెంట్ సరిగ్గా ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు బి.ఆర్.ఎస్ పార్టీ ఏమి చేయలేదని చెప్పడం సిగ్గు చేటన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ అసెంబ్లీ సాక్షిగా బి.ఆర్.ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినట్లు చెప్పాడని మళ్ళీ ఇవ్వలేదని మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. ప్రజా పాలనలో పెట్టుకున్న అప్లికేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రపంచం మొత్తం ఆన్లైన్ లో నడిస్తే కాంగ్రెస్ పార్టీ జిరాక్స్ ల పేరుతో ప్రజలను తిప్పుతుందని మండిపడ్డారు. ప్రజల మధ్య కొట్లాట పెట్టడానికి ప్రజా పాలన సభలు పెట్టారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు ఆడుకునే పరిస్థితికి వచ్చారన్నారు. ప్రజలు ఎవరి దగ్గర చేయు చాచాల్సిన అవసరం లేదని, అన్నింటినీ పోరాడి సాదించుకుందామని అందుకు బి.ఆర్.ఎస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు.