కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూర్: బెజ్జూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంతో ప్రాంతవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ కృషిని స్థానిక నాయకులు, ప్రజలు కొనియాడారు.
డయాలసిస్ సెంటర్ మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ దండే విఠల్, ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్కల చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబరాలు జరుపుకుంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
నాయకులు మాట్లాడుతూ, వెనుకబడిన బెజ్జూర్ ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సెంటర్ ఏర్పాటుతో వారికి పెద్ద ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. స్థానికంగా అందుబాటులోకి రానున్న ఈ సౌకర్యం రోగులకు నిజంగా ఒక “వరం”గా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇకపై సుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సిన అవసరం లేకుండా, సమయానికి చికిత్స పొందే అవకాశముంటుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కిడ్నీ బాధితుల కష్టాలను గుర్తించి త్వరితగతిన డయాలసిస్ సెంటర్ మంజూరు చేయించిన ఎమ్మెల్సీ దండే విఠల్‌కు ఈ ప్రాంతం రుణపడి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బెజ్జూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








