contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గిరిజనుల భూముల జోలికి వస్తే సహించం: ఎమ్మెల్సీ దండే విఠల్

పెంచికలపేట (కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా) : తరతరాలుగా భూములను నమ్ముకుని జీవిస్తున్న గిరిజన రైతుల హక్కులను పరిరక్షించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని, వారి భూముల జోలికి వస్తే సహించేది లేదని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ స్పష్టం చేశారు.

పెంచికలపేట మండలం పోతేపల్లి గ్రామ శివారులో గత కొన్నేళ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులను అటవీ శాఖ అధికారులు వ్యవసాయ పనులు చేయకుండా అడ్డుకుంటున్నారనే సమాచారం అందడంతో ఎమ్మెల్సీ దండే విఠల్ వెంటనే స్పందించారు. స్వయంగా ట్రాక్టర్‌పై సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి, గిరిజన రైతులకు సంఘీభావం ప్రకటించారు.

అనంతరం అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో ఎమ్మెల్సీ ప్రత్యక్షంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తరతరాలుగా సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల విషయంలో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. పంటల సాగు సమయంలో రైతులను బెదిరించడం, వ్యవసాయ పనులను అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు.

గిరిజనుల జీవనాధారమైన పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఏ స్థాయికైనా వెళ్లి పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్సీ దండే విఠల్ స్పష్టం చేశారు. గిరిజనుల హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

ఎమ్మెల్సీ జోక్యంతో అటవీ, రెవెన్యూ అధికారులు సానుకూలంగా స్పందించి, గిరిజన రైతులు తమ పోడు భూముల్లో యథావిధిగా వ్యవసాయ పనులు కొనసాగించేలా చర్యలు చేపట్టారు. దీంతో నెలకొన్న వివాదం సద్దుమణిగింది.

సమస్య తీవ్రతను గుర్తించి తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని తమకు న్యాయం చేసిన ఎమ్మెల్సీ దండే విఠల్‌కు గిరిజన రైతులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :