contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మానవుడు కష్ట, సుఖాలను సమ భావంతో స్వీకరించాలి

పిఠాపురం : కష్ట,సుఖాలను మానవుడు సమ భావంతో స్వీకరించాలని అలా చేసినపుడే అతడు జ్ఞానిగా రూపాంతరం చెందుతాడని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 97వ వార్షిక జ్ఞాన మహాసభల్లో భాగంగా రెండవరోజు సోమవారం పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందుగల నూతన ఆశ్రమ ప్రాంగణంలో జరిగిన సభలో ఆలీషా భక్తులకు అనుగ్రహ భాషణ చేసారు. మానవుడు తన జీవన ప్రయాణంలో ఎదురయ్యే కష్ట, సుఖాలను సమన్వయ పరచుకుంటూ వాటిని ఏకత్వ భావనతో స్వీకరించాలని పేర్కొన్నారు. మానవునిలో మంచి చెడులను ప్రేరేపించేది మనసు అని అన్నారు. మనసులో భావాలను బట్టి మనిషి మనుగడ ఉంటుందని ఆలీషా తెలిపారు. మనసుద్వారా మంచి, చెడు, గుణ గణాల శక్తి మానవుడిపై ప్రభావం చూపిస్తుందని వెల్లడించారు. మానవుడు రాక్షసత్వం వీడి ఈశ్వరత్వం వైపు పయనించాలంటే ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించాలని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక తత్వం, తాత్విక జ్ఞానంతో పొందే తాత్విక శక్తితో మనసును మంచి మార్గంవైపు మరల్చుకోవచ్చునని అన్నారు. అరిషడ్వర్గాలను స్థాయిపరచుకుంటే అది సాధ్యమౌతుందని తెలిపారు. పీఠం అందిస్తున్న ధ్యాన, జ్ఞాన, మంత్ర, సాధనలతో కూడిన త్రయీ సాధన అవలంబించడం ద్వారా మనసులో ఉద్భవించే చెడు భావనలు నియంత్రించబడతాయని వెల్లడించారు. మానవత్వమే మతం, మానవత్వమే ఈశ్వరత్వం అనే స్థాయికి ప్రతిఒక్కరూ చేరుకోవాలని తెలిపారు. అనంతరం పీఠం రూపొందించిన వివిధ కరపత్రాలను, మరియు ఆధ్యాత్మిక గ్రంధాలను అతిధుల సమక్షంలో ఆలీషా సభలో ఆవిష్కరించారు. ముఖ్య అతిధి నిష్కామ ఫౌండేషన్ నిర్వాహకురాలు అరుణ వైరాగ్యం అనే అంశం గురించి సభలో ప్రసంగించారు. నిత్యము, అనిత్యములపై అవగాహన పెంచుకోవడమే వైరాగ్యమని అన్నారు. మానవుడు కోరికలు లేని స్థితికి చేరుకుంటే వైరాగ్యం సిద్దిస్తుందని తెలిపారు. ధనం, బంధం, కీర్తి, ఈ మూడింటి పరిధులను అర్ధం చేసుకుని, మనిషి తన జీవన పయనాన్ని కొనసాగించాలని వెల్లడించారు. ఆధ్యాత్మిక తత్వ ప్రబోధం ద్వారా ప్రతివ్యక్తిలోనూ మానవత్వపు విలువలను పెంపొందించడానికి నిరంతరం పాటుపడుతున్న పీఠాన్ని సందర్శించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు, ఎ.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ఆనందం యొక్క రహస్యాలను సభికులకు తెలియజేసారు. మానవుడు తన జీవితంలో శాశ్వతానందం పొందాలంటే సద్గురువును ఆశ్రయించి జ్ఞాన సాధన చేయాలని పేర్కొన్నారు. పీఠం ఎన్.ఆర్.ఐ. సభ్యులు పేరూరి విజయరామ సుబ్బారావు కృత్రిమ మేధస్సు, ఆధ్యాత్మికత అనే అంశం (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి ప్రసంగించారు. నూతనంగా ఆవిష్కరించబడే ప్రతి అంశం మనిషి మంచికోసమే అయినప్పటికీ కొంత మంది వ్యక్తులు చెడుకోసం కూడా ఉపయోగిస్తున్నారని భవిష్యత్ లో ఊహించని అద్భుతాలకు మూలమయ్యే ఈ కృత్రిమ మేధస్సును మానవుడు మంచిని పెంపొందించే ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా పీఠాధిపతి సోదరులు, పంచాంగకర్త బాణాల దుర్గాప్రసాదాచార్యులు ఉమర్ ఆలీషాను గజమాలతో ఘనంగా సత్కరించారు. భవానీ పీఠం పీఠాధిపతి శివరామ కృష్ణ, షేక్ మహమ్మద్ ఇక్బాల్, డాక్టర్ డి.పద్మావతి, ఉమర్ ఆలీషా సాహితీ సమితి సభ్యుడు టి.సాయి వెంకన్నబాబు, ఎ.రాధాకృష్ణ, జి.రమణ, మదర్ ఇండియా ఇంటర్నేషనల్ అధ్యక్షుడు పిల్లి తిరుపతిరావు, కార్పొరేట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ కాసుబాబు, మన ఊరు మన బాధ్యత అద్యక్షుడు కొండేపూడి శంకరరావు, యెగ్గిన నాగబాబు తదితరులు పీఠాధిపతిని దర్శించుకుని సభలో ప్రశంగించారు. తాత్విక బాలవికాస్ విద్యార్థిని సన్నిబోయిన తేజస్విని మహామంత్రం విశిష్టతను గురించి చేసిన ప్రసంగం సభికులను ఆకట్టుకుంది. సభలో నిర్వహించిన సంగీత విభావరిలో ఉమా ముకుంద బృందం ఆలపించిన కీర్తనలు సభికులను రంజింపచేసాయి. సభలో పాల్గొనడానికి దేశ, విదేశాల నుండి విచ్చేసిన సభ్యులకు ఆశ్రమం వద్ద ఉచిత భోజన మరియు బస్ సౌకర్యాలను వృద్దులకు, దివ్యాంగులకు వీల్ చైర్ సదుపాయాలు కల్పించారు. ఈ సందర్భంగా 216 మంది నూతనంగా మంత్రోపదేశం పొందారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ సెంట్రల్ కమిటీ సభ్యులు, పింగళి ఆనంద్ కుమార్, ఎన్.టి.వి.వర్మ, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :