పార్వతిపురం మన్యం జిల్లా: సోమవారం, కురుపాం మండలంలో అంగన్వాడీ కేంద్రాలు, కేజీబీవీ పాఠశాలల్లో నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రోగ్రాం అధికారి డా. టి. జగన్ మోహనరావు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పిల్లలలో నులిపురుగుల సంక్రమణ నివారణకు “డీవార్మింగ్ డే” కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ఏడాది నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
డా. జగన్ మోహనరావు వివరించగా, నులిపురుగుల సంక్రమణ వలన పిల్లలలో పోషకాహార లోపం, రక్తహీనత, బరువు తగ్గడం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, వాంతులు, వికారం, నీరసం వంటి అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ఈ సంక్రమణని తగ్గించడానికి ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, త్రాగు నీరు మరియు ఆహారం పరిశుభ్రంగా ఉంచడం, ఆరు బయటకు వెళ్ళినపుడు చెప్పులు ధరించడం వంటి అలవాట్లను పాటించడం చాలా ముఖ్యం అని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వై.యోగేశ్వరరెడ్డి, ఎపిడెమిక్ ఈఓ ఎల్. సత్తిబాబు, కేజీబీవీ ప్రిన్సిపల్ యు.ఉమ, వైద్య సిబ్బంది ప్రత్యూష, పద్మ, మురళీ కృష్ణ, అంగన్వాడీ సిబ్బంది సూర్యకుమారి, శోభారాణి, ఆషా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.