గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గన్నేరువరం మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. బీజేపీ గన్నేరువరం మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
సుమారు 200 మీటర్ల పొడవైన భారీ త్రివర్ణ పతాకాన్ని విద్యార్థులు చేతబట్టి రాజీవ్ రహదారి నుంచి గుండ్లపల్లి వీధుల మీదుగా ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో గ్రామం మార్మోగింది. జాతీయ జెండాలతో విద్యార్థులు, యువత చేసిన ర్యాలీ స్థానికులను ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సంఘ నరేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. జాతీయ జెండా భారతదేశ సార్వభౌమత్వం, ఐక్యత, త్యాగాలకు ప్రతీక అని అన్నారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావనను పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
విద్యార్థులు దేశ భవిష్యత్తుకు మార్గదర్శకులని, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సంఘ నరేష్ పేర్కొన్నారు. యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ మాట్లాడుతూ.. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. భారీ సంఖ్యలో విద్యార్థులు, యువత ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో కొండాపూర్ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, పీచుపల్లి సర్పంచ్ సామా రాజిరెడ్డి, కరివేద మహిపాల్ రెడ్డి, ఏలేటి చంద్రారెడ్డి, బండి తిరుపతి, బొమ్మాడి సురేందర్ రెడ్డి, పుల్లెల రాము, గన్నేరువరం 8వ వార్డు సభ్యుడు మచ్చ సాయికృష్ణ, పంబాల రాజశేఖర్, పకిడి మహేందర్, బోయిని అభిషేక్, చొక్కాల లక్ష్మయ్య, కుర్ర హరీష్ తదితరులతో పాటు ప్రజలు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








