గన్నేరువరం : నెలలు గడుస్తున్నా గన్నేరువరం–ఎలగందుల మార్గంలో ప్రతిపాదించిన హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన జరగకపోవడంపై స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కోట్లాది రూపాయల నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించకపోవడంతో ఈ ప్రాజెక్టు కాగితాలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గన్నేరువరం నుంచి ఎలగందుల వెళ్లే మార్గంలో లోయర్ మానేరు డ్యామ్ మీదుగా హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం సీఆర్‌ఎఫ్‌ఐ పథకం కింద రూ.77 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు స్థానికులు తెలిపారు. నిధులు మంజూరై నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే గన్నేరువరం, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాలతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రయాణంలో ఎదురవుతున్న ఇబ్బందులు తగ్గడంతోపాటు పలు గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయని చెబుతున్నారు.
అయితే నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ పనులు ప్రారంభించడంలో జాప్యం ఎందుకు జరుగుతోందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో వ్యవహరించి వెంటనే శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇకనైనా అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టి తమ రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని మూడు మండలాల ప్రజలు కోరుతున్నారు.








