- కరీంనగర్ అదనపు డీసీపీ పి. వెంకట రమణకు ప్రతిష్టాత్మక పురస్కారం
కరీంనగర్, ఆగస్టు 15 (రిపోర్టర్ టీవీ): పోలీస్ శాఖలో అత్యుత్తమ సేవలు, నిబద్ధత, సమర్థవంతమైన విధి నిర్వహణకు గుర్తింపుగా కరీంనగర్ కమిషనరేట్ అదనపు డీసీపీ (అడ్మిన్) పి. వెంకట రమణకు ప్రతిష్టాత్మక ‘President’s Police Medal for Meritorious Service’ (PPM/MSM) పురస్కారం లభించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ మెడల్స్‌లో భాగంగా ఆయన ఈ గౌరవాన్ని అందుకోనున్నారు.
1991లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పోలీస్ శాఖలో సేవా ప్రస్థానాన్ని ప్రారంభించిన పి. వెంకట రమణ హైదరాబాద్ ట్విన్ సిటీస్‌లోని పలు కీలక, మతపరంగా సున్నితమైన ప్రాంతాలతో పాటు టాస్క్‌ఫోర్స్‌లో విధులు నిర్వహించారు. తన సమర్థవంతమైన సేవలతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు.
2005లో ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందిన ఆయన ఇంటెలిజెన్స్ విభాగంలో సేవలందించడంతో పాటు చత్రినాక, ముషీరాబాద్, అంబర్‌పేట్, జడ్చర్ల టౌన్ పోలీస్ స్టేషన్లలో ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 2017లో ఏసీపీగా పదోన్నతి పొంది హైదరాబాద్ ట్రాఫిక్ బ్రాంచ్, గోపాలాపురం, నార్త్ జోన్, టీఎస్ విజిలెన్స్, ఎస్‌ఆర్ నగర్ వెస్ట్ జోన్ తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహించారు.
కీలక కేసుల ఛేదనలో ప్రత్యేక పాత్ర
పోలీస్ అధికారిగా తన ప్రస్థానంలో పి. వెంకట రమణ పలు కీలక కేసుల దర్యాప్తు, ఛేదనలో ముఖ్యపాత్ర పోషించారు. సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న సమయంలో మాండ్రక్స్ (NDPS) కేసులు, అక్రమ ఆయుధాల స్వాధీనం, నార్త్ ఇండియన్ గ్యాంగ్స్, నకిలీ స్టాంపులు, నకిలీ ఇందిరా వికాస్ పత్రాలు, గంజాయి, నకిలీ సర్టిఫికెట్లకు సంబంధించిన కేసుల ఛేదనలో కీలకంగా వ్యవహరించారు.
జడ్చర్ల ఎస్‌హెచ్‌ఓగా పనిచేసిన సమయంలో హత్యలు, హైవే దోపిడీలు, గ్యాంగ్‌రేప్ వంటి తీవ్రమైన కేసులను ఛేదించడంలో కీలక పాత్ర పోషించారు. నేరాల దర్యాప్తును సమర్థవంతంగా పూర్తి చేసి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నారు.
ఇప్పటికే పలు పురస్కారాలు
విశిష్ట సేవలకు గుర్తింపుగా పి. వెంకట రమణ ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. 2010లో తెలంగాణ పోలీస్ సేవా పతకం, 2018లో తెలంగాణ పోలీస్ ఉత్తమ సేవా పతకంతో పాటు యూనియన్ హోం మినిస్టర్స్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్–2022 పురస్కారాన్ని అందుకున్నారు.
అలాగే ఆయన సేవా రికార్డులో 107 క్యాష్ రివార్డులు, ఒక అడ్వాన్స్ ఇన్‌క్రిమెంట్, 7 ప్రశంసా పత్రాలు, 4 అభినందనలు, 15 MSEలు, 162 GSEలు ఉన్నాయి.
కరీంనగర్ కమిషనరేట్‌లో అదనపు డీసీపీగా సేవలు
2025 మే 22న అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన పి. వెంకట రమణ, అదే ఏడాది జూన్ 2 నుంచి కరీంనగర్ కమిషనరేట్‌లో అదనపు డీసీపీ (అడ్మిన్)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
క్రమశిక్షణ, అంకితభావం, సమర్థవంతమైన దర్యాప్తు, ప్రజా భద్రత పట్ల నిబద్ధతతో ఆయన అందించిన విశిష్ట సేవలకు రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ లభించడం పట్ల కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. పి. వెంకట రమణకు అభినందనలు తెలిపారు.








