అనేక పర్యాయాలు ఎవరెస్ట్ ను అధిరోహించిన ఓ నేపాలీ పర్వతారోహకుడు అనూహ్యరీతిలో కన్నుమూశాడు. అతడి పేరు ఎంజిమి టెన్జీ షెర్పా. 38 ఏళ్ల షెర్పా ఎవరెస్ట్ పై చదునుగా ఉండే ప్రాంతంలో కూర్చున్న స్థితిలో విగతజీవుడై కనిపించాడు. ఎవరెస్ట్ పై కాస్తంత విశాలంగా ఉండే ఓ ప్రదేశాన్ని ఫుట్ బాల్ ఫీల్డ్ అని పిలుస్తారు. ఎవరెస్ట్ మొత్తమ్మీద పర్వాతారోహకులకు సురక్షితమైన ప్రదేశం అదే.
అయితే, ఎంజిమి షెర్పా అక్కడే మరణించడం ఇతర పర్వతారోహకులను విషాదానికి గురిచేసింది. అతడు ఎలాంటి ప్రమాదానికి గురికాలేదని, ఎత్తయిన ప్రదేశానికి చేరిన సమయంలో తీవ్ర అస్వస్థత కలగడంతోనే ప్రాణాలు విడిచాడని ఇంటర్నేషనల్ మౌంటైన్ గైడ్స్ భాగస్వామ్య సంస్థ బేయుల్ అడ్వెంచర్స్ కు చెందిన త్సెరింగ్ షేర్పా వెల్లడించారు. ఎంజిమి షెర్పా ఎవరెస్ట్ పై క్యాంప్-2కు వివిధ రకాల సామగ్రి తీసుకెళుతుండగా, ఈ విషాదం చోటుచేసుకుందని త్సెరింగ్ వివరించారు. అతడిని తాము చనిపోయిన స్థితిలో ఉండగా గుర్తించామని, ఆ సమయంలో అతడి వీపునకు బ్యాక్ ప్యాక్ అలాగే ఉందని తెలిపారు.
నేపాల్ కు చెందిన షెర్పాలు ఎవరెస్ట్ పర్వతారోహణలో రాటుదేలినవారిగా గుర్తింపు పొందారు. అందుకే, ఇక్కడికి వచ్చే ఇతరదేశాల పర్వతారోహకులు ఎవరెస్ట్ ను అధిరోహించే క్రమంలో ఇక్కడి షెర్పాల సాయం తీసుకుంటారు.