మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులోని ఆయన నివాసంలో కాసేపటి క్రితం అరెస్ట్ చేశారు. ఆయన సొంత వాహనంలోనే ఏపీకి తరలించారు. ఆయన వెంట ఆయన భార్య రమాదేవి కూడా ఉన్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.
ఏపీలో పదో తరగతి పరీక్ష పేపర్లు లీక్ కావడం వెనుక నారాయణ విద్యాసంస్థలపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. పేపర్ లీక్ చేసింది నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలే అంటూ సీఎం జగన్ నేరుగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరోవైపు, దీనికి సంబంధించి చిత్తూరులో నారాయణపై కేసు నమోదయింది.
అయితే ఏ కేసు కింద నారాయణను అదుపులోకి తీసుకున్నారనే విషయం పోలీసులు చెప్పకపోవడం గమనార్హం. ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే ఆయనను అదుపులోకి తీసుకున్నారని కుటుంబసభ్యులు చెపుతున్నారు. అంతేకాదు, హైదరాబాదులోని స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం కూడా ఇవ్వకుండానే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.