చిన్న శంకరంపేట, జూన్ 5 (రిపోర్టర్ టీవీ): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంతో పాటు చందంపేట, చందాపూర్, జంగరాయి, శేరిపల్లి తదితర గ్రామాల్లో శుక్రవారం పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు.
మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించగా, జంగరాయి గ్రామపంచాయతీ వద్ద సర్పంచ్ ఆవుల గోపాల్ రెడ్డి, చందంపేట గ్రామంలో సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్, చందాపూర్ గ్రామపంచాయతీ వద్ద సర్పంచ్ సీహెచ్. కృష్ణ గౌడ్, శేరిపల్లి గ్రామంలో సర్పంచ్ బండారు సంతోషి గొండస్వామి ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్‌లు మాట్లాడుతూ మానవ మనుగడకు చెట్లు ఎంతో అవసరమని, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో అడవులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతి ఇంటి వద్ద కనీసం ఐదు మొక్కలను నాటి వాటిని సంరక్షించడం ద్వారా స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని భావితరాలకు అందించవచ్చని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, చెట్ల పెంపకాన్ని ప్రజలు ఉద్యమంలా స్వీకరించాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా గ్రామాభివృద్ధికి సంబంధించి చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో పరిశుభ్రత, సురక్షిత తాగునీటి సరఫరా, కాలువల నిర్మాణం, రోడ్ల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు, మహిళా సంఘాల బలోపేతం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలపై వివరించారు.
గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరమని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు.
ఈ కార్యక్రమాల్లో పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








