హైదరాబాద్ వేదికగా ఈ రోజు, రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాయశ్రంలో వీరికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర పార్టీ అగ్రనేతలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు ఘన స్వాగతం పలికారు. వివిధ రాష్ట్రాల నేతలు కూడా హైదరాబాద్ కు చేరుకున్నారు. నగరంలోని తాజ్ కృష్ణ హోటల్లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతాయి. రేపు సాయంత్రం తుక్కగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో సోనియా గాంధీ సహా అగ్ర నేతలంతా పాల్గొంటారు. రాబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ హామీ ఇస్తున్న ఆరు గ్యారంటీ పథకాలను సోనియా ప్రకటించనున్నారు.