సూర్యాపేట జిల్లా: చిన్నపాటి వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసి ఇద్దరి ప్రాణాలను బలిగొన్న ఘటన సూర్యాపేట జిల్లాలో కలకలం రేపింది. మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డతండాలో ఇంటి పక్కన ఉన్న వేపచెట్టు విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం చివరకు రక్తపాతంగా మారింది.
వేపచెట్టుకు సంబంధించి ఇరు వర్గాల మధ్య మొదలైన మాటామాటా క్రమంగా తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఇరువర్గాల వారు పరస్పరం గొడ్డళ్లతో దాడులకు దిగినట్లు సమాచారం. ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఈ దాడిలో గొడ్డలి వేట్లకు గురైన ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో కుప్పకూలారు. తీవ్ర గాయాల కారణంగా వారు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. చిన్నపాటి చెట్టు వివాదం ఏకంగా రెండు నిండు ప్రాణాలను బలితీసుకోవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతున్న విషయం తెలుసుకున్న మేళ్లచెరువు పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఘర్షణను అడ్డుకునే క్రమంలో ఎస్ఐ నవీన్‌కుమార్‌కు కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
ఘటనతో ఎర్రగడ్డతండాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇరువర్గాలను అదుపులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు.
చిన్నపాటి వివాదాలు ప్రాణాంతక ఘర్షణలకు దారితీయకుండా ప్రజలు సంయమనం పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, కేసు నమోదు తదితర అంశాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.








