కనిగిరి: కొటాలపల్లి సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి వెంకటకృష్ణపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తనపై దాడి చేసి, సుమారు గంటపాటు కార్యాలయంలో నిర్బంధించి, బెదిరింపులకు పాల్పడ్డారని బాధిత ఉద్యోగి వెంకటకృష్ణ ఆరోపించారు.
వెంకటకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సచివాలయంలో తన సహోద్యోగి భోజనానికి బయటకు వెళ్లిన సమయంలో తాను కార్యాలయంలో ఒంటరిగా ఉన్నానని చెప్పారు. అదే సమయంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కేలం ఇంద్రభూపాల్రెడ్డితో పాటు ఎలిక అంజయ్య, ఒంగోలు శ్రీను, జైపాల్ తదితరులు కలిపి మొత్తం ఏడుగురు కార్యాలయంలోకి వచ్చి తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
తనను ఉద్దేశపూర్వకంగానే లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని వెంకటకృష్ణ తెలిపారు. టీడీపీ మండల అధ్యక్షుడు కేలం ఇంద్రభూపాల్రెడ్డి ప్లాస్టిక్ కుర్చీతో తన తలపై మూడుసార్లు బలంగా కొట్టారని, దీంతో తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. దాడి సమయంలో తన మొబైల్ ఫోన్ను కూడా లాక్కున్నారని, సుమారు గంటపాటు కార్యాలయంలోనే తనను నిర్బంధించి అసభ్యకరంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను ప్రభుత్వ ఉద్యోగినని, కార్యాలయంలో విధుల్లో ఉన్నానని చెప్పినా వారు వినలేదని, పైగా చంపేస్తామని బెదిరించినట్లు వెంకటకృష్ణ ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు.
కాగా, దాడిలో గాయపడిన వెంకటకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను సీఐటీయూ మాజీ జిల్లా అధ్యక్షుడు పీవీ శేషయ్య పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ ఉద్యోగిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిపై కార్యాలయంలోనే దాడి చేయడం ఆందోళనకరమని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి వాస్తవాలను వెలుగులోకి తేవాల్సి ఉంది. బాధితుడి ఆరోపణలపై నిందితుల వాదన, పోలీసుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.








