సంగారెడ్డి : సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. రూ.1,000 కోట్లు ఖర్చు చేసినా జగ్గారెడ్డి వంటి నాయకుడు దొరకరని సీఎం వ్యాఖ్యానించారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని శ్రీరాముడిగా భావిస్తే, జగ్గారెడ్డి ఆయనకు హనుమంతుడి వంటి వారని అభివర్ణించారు. నాయకులకు మార్కులు వేస్తే తన కంటే జగ్గారెడ్డికే ఎక్కువ మార్కులు వస్తాయని అన్నారు.
ఎన్నికల్లో జగ్గారెడ్డి ఓటమి పాలవడం సంగారెడ్డి ప్రజల దురదృష్టమని సీఎం వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో విజయం సాధించకపోయినా జగ్గారెడ్డి ప్రజలకు దూరం కాలేదని, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారని ప్రశంసించారు.
కుటుంబాన్ని సైతం పక్కనపెట్టి ప్రజల కోసం నిరంతరం శ్రమించే నాయకుడిగా జగ్గారెడ్డిని రేవంత్ రెడ్డి కొనియాడారు. పరిస్థితులు ఎలా ఉన్నా జగ్గారెడ్డి ప్రజా జీవితంలో కొనసాగాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు.
జగ్గారెడ్డి ప్రజలతో మమేకమై పనిచేసే విధానం, ప్రజా సమస్యలపై స్పందించే తీరు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా మాజీ ఎమ్మెల్యేను ఈ స్థాయిలో ప్రశంసించడం కాంగ్రెస్ వర్గాల్లో, స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.








