contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హైదరాబాద్ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌లో స్వల్ప గందరగోళం

హైదరాబాద్‌లో తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ రెండో రోజైన శనివారం స్వల్ప గందరగోళ పరిస్థితి నెలకొంది. గోల్కొండ గోల్ఫ్ క్లబ్ నుంచి గాల్లోకి ఎగిరిన ఓ హాట్ ఎయిర్ బెలూన్ నార్సింగి పరిధిలోని ఇబ్రహీంబాగ్ పెద్ద చెరువు సమీపంలో ల్యాండ్ కావడంతో స్థానికంగా కలకలం రేగింది.

సాంకేతిక లోపం కారణంగా బెలూన్‌ను అత్యవసరంగా దించాల్సి వచ్చిందన్న ప్రచారం తొలుత వెలువడింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ప్రచారాన్ని ఈవెంట్ ఆపరేటర్ ‘స్కై వాల్ట్జ్’తో పాటు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) ఖండించాయి. ఇది అత్యవసర ల్యాండింగ్ కాదని, ముందస్తు ప్రణాళిక ప్రకారం నియంత్రిత పద్ధతిలో సురక్షితంగా జరిపిన సాధారణ ల్యాండింగ్ మాత్రమేనని స్పష్టం చేశాయి. హాట్ ఎయిర్ బెలూన్లు గాలి దిశ, వేగాన్ని అనుసరించి ప్రయాణిస్తాయని, అవసరమైనప్పుడు అనువైన ఖాళీ ప్రదేశాల్లో ల్యాండ్ చేయడం అంతర్జాతీయంగా అనుసరించే ప్రక్రియేనని అధికారులు వివరించారు. ఆ బెలూన్‌లో ఇద్దరు జర్నలిస్టులు, ఒక టెక్నీషియన్ ఉన్నారని తెలిపారు.

ఇదే సమయంలో పరేడ్ గ్రౌండ్ నుంచి బయలుదేరిన మరో హాట్ ఎయిర్ బెలూన్ కూడా సాంకేతిక కారణాలతో మంచిరేవులలోని ఓ ఆలయ ప్రాంగణంలో ల్యాండ్ అయినట్లు సమాచారం. ఈ రెండు ఘటనలపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, అందువల్ల కేసులు నమోదు చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమమని వారు పేర్కొన్నారు.

మొత్తంగా రెండు ఘటనల్లోనూ ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అధికారులు, నిర్వాహకులు ఊరట చెందారు. హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కొనసాగుతుందని, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :