అనంతపురం జిల్లా – గుత్తి : ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనంగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సైతం ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బడిపిలుస్తోంది’ కార్యక్రమం ద్వారా విద్యార్థుల నమోదు ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది.
జిల్లా కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణలో, జిల్లా విద్యాశాఖాధికారి మార్గదర్శకాలు, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉపాధ్యాయ బృందాలు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు భాగస్వామ్యంగా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. మండల విద్యాశాఖాధికారి రవి నాయక్ కన్వీనర్‌గా వ్యవహరించగా, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా పర్యవేక్షణలో కార్యక్రమం విజయవంతమైంది.
మండలంలో మొత్తం 1,996 మంది ఐదేళ్లు పూర్తి చేసుకున్న చిన్నారులు ఉండగా, వారిలో 1,136 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపడం విశేషం. అంతేకాకుండా ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల్లో యూకేజీ పూర్తి చేసిన 43 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ముందుకు రావడం ఆనందదాయకంగా ఉందని అధికారులు తెలిపారు.
అదేవిధంగా ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 163 మంది విద్యార్థులు తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం గమనార్హం. ఈ విజయవంతమైన నమోదు కార్యక్రమానికి గాను జిల్లా కలెక్టర్ నుంచి ప్రశంసలు అందుకోవడం సంతోషకరమని మండల విద్యాశాఖాధికారి రవి నాయక్, ఎంపీడీవో ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, ఇంగ్లీష్ మీడియం బోధన, ప్రతి తరగతి గదిలో స్మార్ట్ టీవీల ఏర్పాటు, విద్యకు సంబంధించిన అన్ని ఖర్చులను ప్రభుత్వం భరించడం వంటి అంశాలు తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయని వారు పేర్కొన్నారు. అదనంగా విద్యార్థులకు ప్రతిరోజూ రాగిజావ, ఉడికించిన గుడ్డు, చిక్కీలు, పోషక విలువలు కలిగిన మధ్యాహ్న భోజనం అందించడం కూడా ప్రభుత్వ పాఠశాలలపై ఆదరణ పెరగడానికి ప్రధాన కారణమని వివరించారు.
ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని రానున్న విద్యా సంవత్సరంలో మరింత మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేస్తామని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు.








