తూప్రాన్: తూప్రాన్ మున్సిపాలిటీలో గత పది సంవత్సరాలుగా కేసీఆర్ నాయకత్వంలోనే సమగ్ర అభివృద్ధి జరిగిందని గజ్వెల్ నియోజకవర్గ ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాలను పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఎగురవేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ పది సంవత్సరాల పాలనలోనే గ్రామ పంచాయతీగా ఉన్న తూప్రాన్‌ను మున్సిపాలిటీగా మార్చి ప్రత్యేక నిధులు మంజూరు చేసి అభివృద్ధి దిశగా నడిపించారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో తూప్రాన్‌కు చెప్పుకోదగిన అభివృద్ధి జరగలేదని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తూప్రాన్‌లో సీసీ రోడ్లు, మున్సిపల్ కాంప్లెక్స్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, రోడ్డు డివైడర్లు, ఎల్ఈడీ లైటింగ్ వ్యవస్థ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యాయని పేర్కొన్నారు. మున్సిపాలిటీ ప్రజలు మరోసారి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని, కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి కొనసాగుతుందని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రవీందర్ గౌడ్, మున్సిపల్ ఇంచార్జి వేణుగోపాల్ రెడ్డి, సతీష్ చారి, సీనియర్ నాయకులు శలాక రాజేశ్వర శర్మ, జడ్పీటీసీ సత్యనారాయణ గౌడ్, బాబుల్ రెడ్డి, వార్డు ఇంచార్జీలు శివగౌని శ్రీనివాస్ గౌడ్, కల్లూరి హరికృష్ణ, పొట్టోళ్ల వెంకట్ గౌడ్, మన్నే శ్రీనివాస్, బాయికాడి అంజి, మల్లికార్జున్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు దుర్గారెడ్డి, రఘుపతి, కమ్మరి శ్రీధర్ చారి, కొక్కొండ కాశీ రెడ్డి, జైపాల్ నాయక్, బండ నాగరాజు, మామిండ్ల అనిల్ తదితరులు పాల్గొన్నారు.









