పార్వతిపురం మన్యం జిల్లాలో ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ఎలాంటి లోపాలు లేకుండా, అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన నిఘా – భద్రతా చర్యలు
జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 33 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, పరీక్షా కేంద్రాలను ‘నో సెల్ ఫోన్ జోన్’గా ప్రకటించారు. సిబ్బందితో సహా ఎవరికీ మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
మాస్ కాపీయింగ్‌కు ఎలాంటి తావులేకుండా ఫ్లయింగ్ స్కాడ్లు, సిట్టింగ్ స్కాడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షా సమయంలో ఉదయం 8:30 గంటల నుంచి కేంద్రాల సమీపంలోని జెరాక్స్, ఇంటర్నెట్ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు.
విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి
విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ అదనపు బస్సులు నడపాలని సూచించారు. వేసవి దృష్ట్యా ప్రతి కేంద్రంలో వైద్య సిబ్బంది, అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, పారిశుధ్యం మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
ప్రతి అధికారి తమకు కేటాయించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి కె. హేమలత, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి వై. నాగేశ్వరరావు, డీఈఓ పి. బ్రహ్మాజీ రావు, డీఎంహెచ్ఓ డా. ఎస్. భాస్కరరావు, ఈపీడీసీఎల్ ఎస్ఈ మల్లిఖార్జునరావు తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








