మెదక్/తూప్రాన్ డివిజన్ : మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి మెదక్ జిల్లా పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు.
ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆటో డ్రైవర్ రజాక్ (27) పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతూ, ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత రెండు సంవత్సరాలుగా పలుమార్లు బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం మరో వివాహం చేసుకున్నప్పటికీ, ఆ విషయంపై బాధితురాలు ప్రశ్నించగా, “నిన్ను కూడా పెళ్లి చేసుకుంటాను” అంటూ మభ్యపెట్టి, విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పటి చేగుంట ఎస్ఐ కె. సుభాష్ 2020 అక్టోబరులో పోక్సో చట్టంతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం అప్పటి తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ సమగ్ర దర్యాప్తు నిర్వహించి, నిందితుడిపై పకడ్బందీగా ఛార్జిషీట్ దాఖలు చేశారు.
విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య బలమైన వాదనలు వినిపించగా, చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, లైజనింగ్ ఆఫీసర్ ఎస్ఐ విఠల్, కానిస్టేబుల్ కృష్ణ, భరోసా లీగల్ అడ్వైజర్ శ్వేత కేసు విచారణలో సమన్వయంతో పనిచేసి దర్యాప్తుకు సహకరించారు.
కేసులో సమర్పించిన సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలు, సాక్షుల వాంగ్మూలాలను క్షుణ్ణంగా పరిశీలించిన మెదక్ జిల్లా పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఆర్.ఎం. శుభవాలి నిందితుడు రజాక్‌కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించారు. అలాగే బాధితురాలికి రూ.1 లక్ష విక్టిమ్ కాంపెన్సేషన్ అందజేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, మహిళలు, బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడే వారిపై చట్టం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ప్రతి కేసును శాస్త్రీయంగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం జరిగేలా, నేరస్థులకు కఠిన శిక్షలు పడేలా మెదక్ జిల్లా పోలీసులు కట్టుబడి పనిచేస్తున్నారని తెలిపారు.
మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులు, లైంగిక నేరాలకు గురైనా భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని, వారికి పూర్తి రక్షణతో పాటు చట్టపరమైన సహాయం అందజేస్తామని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పేర్కొన్నారు.








