కాకినాడ: కాకినాడ నగరంలో పారిశుధ్య నిర్వహణలో లోపాల కారణంగా చెత్త కుప్పలు పేరుకుపోతుండటంతో పాటు వీధికుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోందని పౌర సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. నగరంలో ప్రధాన రహదారులపై మాత్రమే ఉదయం వేళల్లో పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారని, అయితే సాయంత్రానికి అనేక ప్రాంతాల్లో మళ్లీ చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయని సంఘం పేర్కొంది.
చెత్త కుప్పల వద్ద వీధికుక్కలు గుంపులుగా చేరి పాదచారులు, ద్విచక్ర వాహనదారులను తరుముతున్న ఘటనలు పెరుగుతున్నాయని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘం తెలిపింది. కుక్కల దాడులకు గురైతే బాధితులే ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.
నగరంలో చెత్తను రోజుకు రెండు పూటలా తరలించే విధంగా చర్యలు చేపట్టాలని, పారిశుధ్య సిబ్బంది సంఖ్యను పెంచాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, నగర పాలక సంస్థకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన నిధులు అందకపోవడం కూడా పారిశుధ్య నిర్వహణపై ప్రభావం చూపుతోందన్నారు. 18 ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన ఆస్తి పన్ను బకాయిలు రూ.42.80 కోట్లు, 14 ప్రభుత్వ శాఖలు వినియోగించిన జనరల్ ఫండ్ బకాయిలు రూ.31.67 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే జిల్లా కేంద్రంలో చెత్త కుప్పలు, వీధికుక్కల సమస్య మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని హెచ్చరించారు.
అలాగే, వీధికుక్కల దాడికి గురైన బాధితులకు నగర పాలక సంస్థ తరఫున రూ.10 వేల ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రత్యేక పథకం అమలు చేయాలని దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు. కర్నూలు నగర పాలక సంస్థలో కుక్కకాటుకు గురైన వారికి రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తున్న విధానాన్ని కాకినాడలో కూడా అమలు చేయాలని ఆయన కోరారు.








