అనంతపురం జిల్లా, పెద్దవడుగూరు: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలానికి నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా వై. నరేందర్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రాఘవేంద్రప్పతో పాటు పోలీసు సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు.
బాధ్యతలు చేపట్టిన అనంతరం సీఐ వై. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. మట్కా, పేకాట, గంజాయి విక్రయాలు వంటి చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలు పోలీసు శాఖకు సహకరించి, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని ఆయన కోరారు. ప్రజల భద్రత, ప్రశాంత వాతావరణం కోసం పోలీసులు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తారని తెలిపారు.
కాగా, గతంలో పెద్దవడుగూరు సీఐగా విధులు నిర్వహించిన రామసుబ్బయ్య బదిలీపై అనంతపురానికి అటాచ్ కావడంతో, ఆయన స్థానంలో వై. నరేందర్ రెడ్డి నియమితులై బాధ్యతలు స్వీకరించారు. కొత్త సీఐ నియామకంతో మండలంలో పోలీసు వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందనే ఆశాభావాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.








