కాగజ్‌నగర్ : పట్టణంలోని కాగజ్‌నగర్‌లో నిషేధిత మట్కా దందాపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన గాంధీ పార్క్ చౌక్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది.
విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణ ఎస్సై సుధాకర్ తన సిబ్బందితో కలిసి గాంధీ చౌక్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా ఒక ఆటోలో కూర్చొని మట్కా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించగా ఐదుగురు వ్యక్తులు పట్టుబడ్డారు.
పోలీసులు నిందితుల వద్ద నుంచి నగదు రూ.10,400, ఒక ఆటో, ఒక బైక్, నాలుగు సెల్ఫోన్లు మరియు మట్కా చిట్టీలను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టైన వారిలో ఎండీ ఖాజా (ఆటో డ్రైవర్), ఎండీ నన్ను, ఎస్కే నవాజ్, కొట్రంగి సంతోష్, రెండ్ల అంజయ్య ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నిషేధిత ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ మట్కా, సట్కా వంటి జూద క్రీడలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఏవైనా అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని ఎస్సై సుధాకర్ ప్రజలను కోరారు.








