తిరుపతి :తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో సనాతన వేద ధర్మ పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటైన శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో పరిపాలన, నిధుల వినియోగం, నియామకాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ నిధులతో నిర్వహించబడుతున్న ఈ విశ్వవిద్యాలయంలో అక్రమాలు, అవినీతి, బంధుప్రీతి, పరిపాలనా లోపాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపిస్తూ, వైస్ ఛాన్సలర్ రాణి సదాశివమూర్తి, రిజిస్ట్రార్ బలభద్ర ఉపాధ్యాయలను తక్షణమే తొలగించి సమగ్ర విజిలెన్స్ విచారణ చేపట్టాలని వేద పండితులు, బోధన, బోధనేతర సిబ్బంది డిమాండ్ చేశారు.
వ్యవస్థాపక దినోత్సవం, వేదోత్సవాల నిర్వహణపై అభ్యంతరాలు
జూలై 12న నిర్వహించిన విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవాన్ని టీటీడీ అధికారులు, మీడియాకు సమాచారం ఇవ్వకుండా రహస్యంగా నిర్వహించారని ఆరోపించారు. అలాగే జూలై 31, ఆగస్టు 1, 2 తేదీల్లో నిర్వహించనున్న వేదోత్సవాల విషయాన్ని కూడా టీటీడీ అధికారులకు తెలియజేయలేదని విమర్శించారు. ప్రజాధనంతో నిర్వహించే కార్యక్రమాల్లో పారదర్శకత లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
వీసీ అర్హతలు, నియామకంపై ప్రశ్నలు
ప్రస్తుత వైస్ ఛాన్సలర్‌కు వేద విద్యలో అవసరమైన విద్యార్హతలు, యూజీసీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన అనుభవం లేవని ఆరోపించారు. నోటిఫికేషన్, సెర్చ్ కమిటీ లేకుండానే నియామకం జరిగిందని, పదవీకాలం, వయోపరిమితికి సంబంధించిన నిబంధనలు కూడా పాటించలేదని పేర్కొన్నారు.
నియామకాల్లో బంధుప్రీతి, నకిలీ సర్టిఫికెట్ల ఆరోపణలు
రిజిస్ట్రార్ బలభద్ర ఉపాధ్యాయపై గతంలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందారనే ఆరోపణలు ఉన్నాయని, అలాంటి వ్యక్తిని కీలక పదవిలో కొనసాగించడం సరికాదని విమర్శించారు. స్థానిక ఉద్యోగులను పక్కనబెట్టి బంధువులకు ప్రాధాన్యం ఇవ్వడం, మహిళా ఉద్యోగులపై వేధింపులు, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని పేర్కొన్నారు.
విద్యార్థుల సమస్యలు, సిబ్బంది తొలగింపుపై ఆందోళన
విద్యార్థులకు అందాల్సిన స్టైపెండ్లు, ప్రోత్సాహకాలను నిలిపివేశారని, హాస్టల్ నిర్వహణ పేరుతో విద్యార్థుల నుంచే చందాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన విద్యార్థులను బదిలీ సర్టిఫికెట్ (టీసీ)తో బయటకు పంపిస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. క్రీడా మైదానాలను తొలగించడం వల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు.
అదేవిధంగా, 11 నెలల ఒప్పందంతో నియమించిన రీసెర్చ్ అసిస్టెంట్లను ఒప్పంద గడువు పూర్తికాకముందే ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా తొలగించారని ఆరోపించారు.
ఆర్థిక వ్యవహారాలపై విచారణ కోరుతూ డిమాండ్లు
విశ్వవిద్యాలయంలో నిధుల మళ్లింపు, ఆర్థిక అవకతవకలు వెలుగులోకి వస్తాయనే భయంతో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ), ఫైనాన్స్ కమిటీ (ఎఫ్‌సీ) సమావేశాలను నిర్వహించడం లేదని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం, టీటీడీ వెంటనే జోక్యం చేసుకుని:
- వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్‌లను విధుల నుంచి తొలగించాలని,
- నియామకాలు, నిధుల వినియోగం, నకిలీ సర్టిఫికెట్లు, బంధుప్రీతి, రీసెర్చ్ అసిస్టెంట్ల తొలగింపుపై సమగ్ర విజిలెన్స్ విచారణ జరిపించాలని,
- నిబంధనల ప్రకారం కొత్త సెర్చ్ కమిటీ ద్వారా అర్హత కలిగిన వైస్ ఛాన్సలర్‌ను నియమించాలని,
- విశ్వవిద్యాలయ పరిపాలనను టీటీడీ ప్రత్యక్ష పర్యవేక్షణలోకి తీసుకురావాలని వేద పండితులు, సిబ్బంది డిమాండ్ చేశారు.








