జియ్యమ్మవలస (కురుపాం): రాష్ట్రంలో నాటుసారా రహిత సమాజం నిర్మాణం లక్ష్యంగా అమలు చేస్తున్న ‘నవోదయం 2.0’ కార్యక్రమంలో భాగంగా జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో ఎక్సైజ్ మరియు టాస్క్ ఫోర్స్ అధికారులు సోమవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ కార్డాన్ సెర్చ్‌లో భారీగా నాటుసారా స్వాధీనం చేసుకున్నారు.
పార్వతీపురం మన్యం మరియు విజయనగరం జిల్లాల అసిస్టెంట్ కమిషనర్ పైడి రామచంద్రరావు ఆదేశాల మేరకు, ఏఈఎస్ ఏ. సంతోష్ పర్యవేక్షణలో ఈ తనిఖీలు చేపట్టారు. గ్రామంలోని అనుమానిత ప్రాంతాలను జల్లెడ పట్టిన అధికారులు, నాటుసారా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు చేసినవారు వెలగాడ ప్రకాశరావు (చినమేరంగి), మీసాల స్వప్న (చినమేరంగి)గా గుర్తించారు. వీరి వద్ద నుంచి సుమారు 40 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
నిందితులతో పాటు వారికి సారా సరఫరా చేస్తున్న వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. అనంతరం నిందితులను జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కురుపాం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, సరిహద్దు ప్రాంతాల్లో నాటుసారా తయారీ, రవాణా, అమ్మకాలపై నిరంతర నిఘా ఉంచుతున్నామని హెచ్చరించారు. నాటుసారా రహిత మండలాల సాధనలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు.
అలాగే నాటుసారాకు సంబంధించిన సమాచారం ఉన్నవారు 6302936599 ఫోన్ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
ఈ దాడుల్లో పార్వతీపురం టాస్క్ ఫోర్స్ ఎస్ఐ చంద్రకాంత్, కురుపాం స్టేషన్ ఎస్ఐ జె. రాజశేఖర్ తదితర ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.








