కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్నగర్ పట్టణం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని అధికార యంత్రాంగం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజలు నిత్య ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి పక్కన ఉన్న ప్రధాన రహదారి గత కొన్నేళ్లుగా పూర్తిగా బురదమయంగా మారి, ప్రయాణికులకు తీవ్ర సమస్యగా మారింది.
ఈ రహదారి ద్వారా పట్టణంలోని కూరగాయల మార్కెట్, ఆసుపత్రులు, మెడికల్ షాపులు, ఎరువుల దుకాణాలు, కిరాణా షాపులు వంటి అనేక ముఖ్య కేంద్రాలకు ప్రజలు చేరుకుంటుంటారు. రోజూ వందలాది మంది ఈ మార్గాన్ని వినియోగిస్తున్నప్పటికీ, రహదారి పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది.
బురదతో నిండిపోయిన ఈ మార్గంలో వాహనదారులు తరచూ అదుపుతప్పి పడిపోతుండగా, పాదచారులు కాలుజారి గాయాలపాలవుతున్న ఘటనలు జరుగుతున్నాయి. వర్షాకాలంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారి, నడవడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడుతోంది.
ఎన్నో ఏళ్లుగా సమస్య అలాగే కొనసాగుతున్నప్పటికీ, ప్రజాప్రతినిధులు గానీ, సంబంధిత అధికారులు గానీ ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ప్రజా ప్రభుత్వం” అని చెప్పుకోవడం తప్ప, కనీసం ప్రజలు నడిచే రహదారిని కూడా బాగు చేయలేని పరిస్థితిలో అధికారులు, నాయకులు ఉన్నారని వారు విమర్శిస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రహదారిని తక్షణమే మరమ్మతులు చేయించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.








