మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని తాతపాపన్పల్లిలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహంపై జరిగిన దాడిని గురువారం తూప్రాన్ పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంఘ సభ్యులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.
పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోవూరి శ్రీనివాస్ గుప్త ఆధ్వర్యంలో నాయకులు అక్కడికి చేరుకుని విగ్రహం ధ్వంసం కావడాన్ని తీవ్రంగా నిరసించారు. ఈ ఘటన పథకం ప్రకారమే జరిగిందా అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని వారు కోరారు.
ఈ సందర్భంగా లయన్ పల్లెర్ల రవీందర్ గుప్త మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ విగ్రహంపై దాడి జరగడం సమాజాన్ని కలవరపరిచే ఘటన అని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో కొన్ని ప్రాంతాల్లో మహాత్మా గాంధీ విగ్రహాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్న నేపథ్యంలో తాతపాపన్పల్లి ఘటన కూడా పథకం ప్రకారం జరిగి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ చేపట్టాలని, దుండగులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ వంటి మహనీయుల విగ్రహాలపై దాడులు జరగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తదనంతరం ఆర్యవైశ్య సంఘం నాయకులు తూప్రాన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్ఐ జ్యోతి కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మహాత్మా గాంధీ విగ్రహంపై దాడికి పాల్పడిన నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు పల్లెర్ల రవీందర్ గుప్త, ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉప్పల నర్సింలు గుప్తా, ఆర్యవైశ్య మహాసభ జిల్లా నాయకులు బుక్క అశోక్, పల్లెర్ల బాలేష్ గుప్తా, పెద్దిగారి నగేష్ గుప్త, దేవత శ్రావణ్ కుమార్, బుక్క విజయ్ కుమార్, నేతి సాగర్, ఉప్పల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.








