contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రుణం చెల్లించలేదని ఇంటికి తాళం వేసిన ఫైనాన్స్‌ ఏజెంట్లు

మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని యావపూర్ గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో అప్పు చెల్లించలేకపోయిన కుటుంబాన్ని ఇంటి నుంచి బయటకు గెంటి, ఇంటికి తాళం వేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంఘటన చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన బుధవారం ఉదయం జరిగింది.

గ్రామానికి చెందిన కొత్త స్వామి తన అన్నదమ్ములు మల్లేష్, స్వామిల పేర్లపై తూప్రాన్‌లోని మైక్రో ఫైనాన్స్ సంస్థ నుంచి సుమారు రూ.10 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు తెలిపారు. అప్పు ఇచ్చే సమయంలో కమిషన్ పేరిట రూ.80 వేల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. కొంతకాలం పాటు క్రమంగా వాయిదాలు చెల్లించినప్పటికీ, ఇటీవల కుటుంబంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యల కారణంగా నెలవారీ కిస్తీలు చెల్లించలేకపోయామని చెప్పారు.

తాను ఇంట్లో లేని సమయంలో ఫైనాన్స్ సంస్థకు చెందిన వ్యక్తులు తరచుగా ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను బెదిరిస్తూ వెళ్లేవారని స్వామి పేర్కొన్నారు. బుధవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో దాదాపు 20 మంది ఇంటికి వచ్చి కొంత మొత్తాన్ని చెల్లిస్తామని చెప్పినా వినకుండా కుటుంబ సభ్యులను ఇంటి నుంచి బయటకు గెంటి తాళాలు వేసుకున్నారని ఆరోపించారు.

ఇటీవల తన కుమారుడు అనారోగ్యంతో మరణించాడని, కుమార్తె గర్భవతిగా ఉండి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటోందని, ఆమె వివాహం చేయడంతో అప్పుల్లో కూరుకుపోయానని స్వామి తెలిపారు. ఈ నేపథ్యంలో వాయిదా ఇవ్వాలని ఫైనాన్స్ సంస్థ ప్రతినిధి మనోహర్‌ను కోరినా స్పందించలేదని చెప్పారు.

ఇంట్లో ఉన్న రూ.80 వేల రూపాయలను కూడా తీసుకోకుండా “డబ్బులు వద్దు, ఇల్లు స్వాధీనం చేసుకుంటాం” అంటూ తమ కుటుంబాన్ని బయటకు పంపి తాళం వేసి వెళ్లిపోయారని బాధితులు తెలిపారు. ప్రస్తుతం ఇంటికి తాళం వేయడంతో తాము రోడ్డున పడ్డామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. ఫైనాన్స్ సంస్థ వేధింపుల నుంచి తమను రక్షించాలని, సమస్యకు న్యాయం చేయాలని వారు అధికారులను కోరుతున్నారు. అప్పు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అవకాశం ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యమవుతుందని బాధితులు వాపోయారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :