కరీంనగర్ జిల్లా: గన్నేరువరం గ్రామం నుంచి మానేరు నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతూ గన్నేరువరం గ్రామ సర్పంచ్ రంగనవేణి లచ్చినర్సు, ఉప సర్పంచ్ రామంచ స్వామి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కరీంనగర్ జిల్లా ఈఈ, డిఈఈలను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గన్నేరువరం ఆది హనుమాన్ గుడి నుంచి మానేరు నదిపై బ్రిడ్జి నిర్మిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా గన్నేరువరం, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు మండలాల అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు.
ప్రస్తుతం ప్రజలు రాకపోకల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బ్రిడ్జి నిర్మాణం జరిగితే సమీప గ్రామాల మధ్య అనుసంధానం పెరిగి ప్రజలకు సౌకర్యం కలుగుతుందని అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశాన్ని పరిశీలించి మానేరు బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వారు అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో గన్నేరువరం గ్రామ వార్డు సభ్యులు మచ్చ సాయి కృష్ణ, ఏలేటి శ్రీకాంత్, రంగనివేణి సతీష్, గ్రామ నాయకులు దుర్ముట్ల కిట్టు, బొడ్డు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.








