contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గ్యాస్ వినియోగదారులకు ఆందోళన వద్దు

  • జిల్లాలో ఎటువంటి గ్యాస్ కొరత లేదు… తగినన్ని నిల్వలు ఉన్నాయి.
  • జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి.

 

పార్వతీపురం: జిల్లాలోని గ్యాస్ వినియోగదారులు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని, జిల్లాలో గ్యాస్ కొరత లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. యుద్ధ వాతావరణం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడుతుందనే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నట్లు చెప్పారు. గ్యాస్ దొరకదనే అపనమ్మకంతో ఖంగారు పడి సిలిండర్ ఖాళీ కాకుండానే ముందస్తుగా బుక్ చేస్తున్నారని, ఖాళీ సిలిండర్ ఇస్తేనే కొత్తది సరఫరా చేయడం జరుగుతుందని జేసీ తేల్చి చెప్పారు. గురువారం ఆయన జిల్లాలోని పలు గ్యాస్ ఏజెన్సీలను ఆకస్మికంగా తనిఖీ చేసి, నిల్వలు మరియు పంపిణీ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని గ్యాస్ ఏజెన్సీలను జేసీ, సబ్ కలెక్టర్లు, తహశీల్దార్లు గ్యాస్ నిల్వలు, పంపిణీ తీరును పరిశీలించినట్లు చెప్పారు. జిల్లాలో వంట గ్యాస్ సరఫరా సాధారణంగానే ఉందని, ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని అన్నారు. గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, జిల్లాలోని 15 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సుమారు 1.20 లక్షల మంది వినియోగదారులకు గ్యాస్ అందుతోందని వివరించారు. ప్రస్తుతం గోడౌన్లలో 9,000 పైచిలుకు సిలిండర్ల నిల్వలు ఉన్నాయని, విశాఖపట్నంలోని బాట్లింగ్ ప్లాంట్ల నుండి ప్రతిరోజూ జిల్లాకు గ్యాస్ సిలిండర్లు సరఫరా అవుతున్నట్లు పేర్కొన్నారు.రోజువారీగా 3 నుండి 4 వేల బుకింగ్లు సజావుగా జరుగుతున్నాయని, అయితే యుద్ధ వాతావరణం వలన గ్యాస్ కొరత ఉండవచ్చనే అపోహతో దాదాపు 80 శాతం బుకింగ్స్ పెరిగినట్లు జేసీ తెలిపారు.

ప్రభుత్వం తరఫున గ్యాస్ వినియోగదారులకు విజ్ఞప్తి.

గ్యాస్‌ పంపిణీలో ఎటువంటి కొరత లేదని, ఇంతకుముందు ఏ విధంగా సరఫరా అయిందో, ప్రస్తుతం కూడా అదేవిధంగా సరఫరా చేసేందుకు యంత్రాంగం మొత్తం సమాయత్తమై ఉందన్నారు. దయచేసి ఎటువంటి అపోహలకు గురికావద్దని, అవసరం లేకపోయినా కూడా గ్యాస్ మీరు బుక్ చేసుకొని కృత్రిమ కొరత సృష్టించడంలో పాల్పంచుకోవద్దని జేసీ విజ్ఞప్తి చేశారు.

గ్యాస్ ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్.

గ్యాస్ సరఫరాలో ఫిర్యాదుల కొరకు జిల్లా పౌర సరఫరాల కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అన్నారు. గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలు వసూలు, బుకింగ్ చేసినా సరఫరా చేయక పోవడం వంటి సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్‌ 70130 60665 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అన్నారు. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగా సమస్యను పరిష్కరించి, తీసుకున్న చర్యలను వినియోగదారులకు తెలియజేస్తామని జెసి ఈ సందర్బంగా హామీ ఇచ్చారు. ప్రజలు వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఆకస్మిక పర్యటనలో జిల్లా సరఫరాల అధికారి బి.అశోక్ కుమార్, గ్యాస్ ఏజెన్సీల డిస్ట్రిబ్యూటర్లు, పౌర సరఫరాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :