కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్ నగర్ పట్టణంలోని విజయబస్తీ కాలనీలో గల ప్రభుత్వ ‘ఒర్రె’ ను కబ్జా చేసి అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న వారిపై మున్సిపల్ యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ తిరుపతి ఆదేశాల నిమిత్తం టౌన్ ప్లానింగ్ అధికారులు కబ్జా స్థలాన్ని పరిశీలించి, ఆక్రమణలను తొలగించారు. ‘ప్రజావాణి’ కార్యక్రమంలో విజయబస్తీ కాలనీలోని ఒర్రెను కొంతమంది వ్యక్తులు ఆక్రమించి ఇంటి నిర్మాణం కోసం కందకాలు తవ్వుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన మున్సిపల్ కమిషనర్ , క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు.
అధికారుల విధులకు ఆటంకం – కేసు నమోదు
కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారి మరియు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు సిబ్బందితో కలిసి విజయబస్తీకి చేరుకున్నారు. జెసిబి సహాయంతో ఒర్రెను కబ్జా చేసి తవ్విన కందకాలను పూడ్చివేసి, ప్రాంతాన్ని చదును చేస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు అధికారులను అడ్డుకుని దురుసుగా ప్రవర్తించారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, పనులను నిలిపివేయడానికి ప్రయత్నించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన మున్సిపల్ కమిషనర్ , టౌన్ ప్లానింగ్ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన సదరు ఇద్దరు వ్యక్తులపై కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మున్సిపల్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ జారీ చేశారు.
కమిషనర్ హెచ్చరిక..
ప్రభుత్వ భూములను, నీటి వనరులను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మున్సిపల్ కమిషనర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.








