భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల: ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ప్రమాదకర వ్యవసాయ బావిపై రిపోర్టర్ టీవీ కథనం ప్రచురించినప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటికీ స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు పలుమార్లు హెచ్చరించినా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో, గ్రామ ప్రవేశ మూలమలుపు వద్ద రహదారికి ఆనుకుని ఉన్న వ్యవసాయ బావి ప్రస్తుతం ప్రమాదకరంగా మారింది. రక్షణ గోడ లేకపోవడంతో పాటు బావి అంచులు దెబ్బతినడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో గ్రామస్థులు ప్రయాణిస్తున్నారు.
వెంకట్రావుపల్లికి అనుబంధంగా ఉన్న జోడుపల్లెకు వ్యవసాయ పనుల కోసం హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, ట్రక్కులు, లారీలు తరచుగా ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా వరి కోతల సీజన్‌లో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించే భారీ వాహనాలు ఈ రహదారిని అధికంగా వినియోగిస్తున్నాయి. అయితే మూలమలుపు వద్ద ప్రమాదకర బావి ఉండటంతో రహదారి ఇరుకుగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని రైతులు తెలిపారు.
అంతేకాకుండా బావి పక్కనున్న రహదారి కింద మట్టి క్రమంగా కుంగిపోతుండటంతో రోడ్డు పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి మరింత విషమించకముందే అధికారులు స్థలాన్ని పరిశీలించి రక్షణ గోడ నిర్మించడం, రహదారిని బలోపేతం చేయడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం వంటి అత్యవసర చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇక గ్రామంలో ఇతర సమస్యల పరిష్కారంలోనూ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామ సభలు సక్రమంగా నిర్వహించడం లేదని, అర్హులైన ఒంటరి మహిళలకు పింఛన్లు అందడం లేదని, వీధి దీపాల సమస్యతో పాటు పలు మౌలిక సదుపాయాల లోపాలు నెలకొన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి ప్రమాదకర వ్యవసాయ బావికి శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు గ్రామంలో నెలకొన్న ఇతర సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని వెంకట్రావుపల్లి గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గ్రామ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు.








