గుంతకల్ : Konidela Pawan Kalyan సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని గుంతకల్ మరియు గుత్తి ప్రాంతాల్లో జనసేన పార్టీ నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాలు భక్తి, సేవా భావం మరియు సామాజిక బాధ్యతను ప్రతిబింబించేలా జరిగాయి.
ముందుగా గుంతకల్ పట్టణంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అమృత వర్షిణి అనాధాశ్రమంలో మండల అధ్యక్షుడు కురువ పురుషోత్తం ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి, అనాధలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ హాజరయ్యారు. ఆయన ఆధ్వర్యంలో గుత్తి పట్టణం రాయల్ సర్కిల్‌లో అల్పాహార వితరణ కార్యక్రమం చేపట్టడంతో పాటు పట్టణ అధ్యక్షుడు పాటిల్ సురేష్ అధ్యక్షతన ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
అదేవిధంగా స్థానికంగా తైక్వాండోలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ మరియు వసతి కల్పిస్తున్న సాయి తేజను జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ జనసేన పార్టీ పేదవాడి ఆకలి మంటల్లో నుంచి పుట్టిన పార్టీ అని అన్నారు. జనసేన అధినేత Pawan Kalyan సామాజిక బాధ్యతతో, స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో పార్టీని స్థాపించారని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజల కోసం తన స్వార్థాన్ని పక్కనపెట్టి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఆయన కొనియాడారు.
నిజాయితీ గల నాయకుడి వెంట నడవడం గర్వకారణమని, పంచాయతీరాజ్ శాఖకు వన్నె తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమేనని మణికంఠ అన్నారు.
ఈ కార్యక్రమంలో గుంతకల్ మరియు గుత్తి పట్టణాలకు చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








