contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఈ అమ్మాయిలు నిజం కాదు.. వారి ట్రాప్‌లో పడకండి: సజ్జనార్ హెచ్చరిక

హైదరాబాద్:  సోషల్ మీడియాలో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమ్మాయిల వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ వీ.సి. సజ్జనార్ యువతకు హెచ్చరిక జారీ చేశారు. ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.

“మీరు ఒంటరిగా ఉంటున్నారా? ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని అందమైన అమ్మాయిలతో మాట్లాడండి” అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్న ప్రకటనల వెనుక ప్రమాదకరమైన సైబర్ ఉచ్చు దాగి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియోల్లో కనిపిస్తున్న మహిళలు నిజమైన వారు కాదని, అవన్నీ కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో సృష్టించినవేనని స్పష్టం చేశారు.

యువత మాయమాటలకు మోసపోయి ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటే, వారి వ్యక్తిగత సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ఫోన్‌లోని కాంటాక్ట్స్, గ్యాలరీ వంటి వివరాలను దొంగిలించి, తర్వాత బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారని తెలిపారు.

ముఖ్యంగా వీడియో కాల్స్ పేరుతో మోసం చేస్తున్నారని, కాల్‌లో అవతలి వైపు అసభ్యకర వీడియోలు ప్రదర్శించి, అదే సమయంలో వినియోగదారుడి ముఖాన్ని రికార్డ్ చేసి మార్ఫింగ్ చేస్తున్నారని హెచ్చరించారు. అనంతరం ఆ వీడియోలను బంధుమిత్రులకు పంపిస్తామని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు.

పరువు పోతుందనే భయంతో బాధితులు డబ్బులు చెల్లిస్తే, చివరకు వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయని సజ్జనార్ తెలిపారు. YouTube, Instagram, Facebook వంటి వేదికలలో ఇలాంటి మోసపూరిత ప్రకటనలు ఇస్తున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆన్‌లైన్‌లో ఎవ్వరూ ఉచితంగా స్నేహం చేయరని, ఆ ఆకర్షణ వెనుక మీ డబ్బు, పరువును దోచుకునే కుట్ర దాగి ఉంటుందని యువత గ్రహించాలని సూచించారు. గుర్తు తెలియని ఫేక్ డేటింగ్, వీడియో కాలింగ్ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని సూచించారు.

ఇలాంటి సైబర్ మోసాల బారిన పడ్డవారు భయపడకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని లేదా అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. యువత జాగ్రత్తగా ఉండి తమ భద్రతను కాపాడుకోవాలని సజ్జనార్ పిలుపునిచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :