గోదావరిఖని : మట్టి వినాయకులను పూజించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు నీటి కాలుష్యాన్ని నివారించవచ్చని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి అన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో మట్టి వినాయకులను వినియోగించాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.
కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తూ, వాటి వల్ల కలిగే పర్యావరణ ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను చెరువులు, నదుల్లో నిమజ్జనం చేయడం వల్ల నీటి కాలుష్యం పెరిగి జలచరాలకు, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సంధ్యారాణి తెలిపారు. మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా మన సంప్రదాయాలను కాపాడటంతో పాటు ప్రకృతిని కూడా రక్షించుకోవచ్చని పేర్కొన్నారు.
“మట్టి వినాయకులను పూజిద్దాం.. నీటి కాలుష్యాన్ని నివారిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆమె తెలిపారు. ప్రజలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మట్టి వినాయకులను స్వీకరించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ, బీజేపీ లేబర్ సెల్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ తడగొండ నరసయ్య, బీజేపీ పెద్దపల్లి జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు ఎల్తూరి సరిత, నాయకులు కొట్టే నరేష్, అందే రాజ్‌కుమార్ చారి, సాతిరి గంగరాజు, కొమ్మల స్వామి, జక్కుల ప్రవీణ్–పద్మ, ఎల్తూరి రాజయ్య, పాకాల నరసింహారెడ్డి, హనుమాన్ల వెంకటేష్, అంకరి భరత్, మిస వికాస్, లింగాల శంకర్, నిహారిక తదితరులు పాల్గొన్నారు.








