కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం: మండల కేంద్రంలోని రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు జనరల్ ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. గ్రామ పంచాయతీల సమర్థ నిర్వహణ కోసం ఈ శిక్షణ కార్యక్రమాన్ని రెండు విడుతలుగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మొదటి విడత శిక్షణ 2026 మార్చి 23 నుండి మార్చి 28 వరకు, రెండవ విడత మార్చి 30 నుండి ఏప్రిల్ 4 వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యులకు పంచాయతీ పరిపాలనకు సంబంధించిన వివిధ అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు.
శిక్షణలో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, ఆదర్శ గ్రామాల రూపకల్పన, పరిశుభ్రత నిర్వహణ, ఈ-పంచాయతీ అప్లికేషన్లు, భవన అనుమతులు, పన్నుల వసూలు విధానం, రికార్డుల నిర్వహణ, ఉపాధి హామీ పథకం, తాగునీటి సరఫరా, గ్రామ ఆదాయం-వ్యయాల నిర్వహణతో పాటు వార్డు సభ్యుల బాధ్యతలపై ప్రత్యేకంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఓ సురేందర్, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ (టీఓటీ) బృందం, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరమని అధికారులు పేర్కొన్నారు.








