తిరుపతి: తిరుపతి మల్లంగుంటలోని గీతం జూనియర్ కాలేజీలో చదువుతున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి జస్వంత్ రెడ్డి ఈ నెల 11వ తేదీ నుంచి కనిపించకుండా పోవడం తీవ్ర కలకలానికి దారితీసింది. దాదాపు రెండు వారాలు గడిచినా విద్యార్థి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వైఎస్సార్ ఎస్ యు, ఎన్ ఎల్ ఎస్ ఏ, ఎన్ ఎస్ యు ఐ, ఓబీసీ విద్యార్థి సంఘం, బీసీ యువజన, జీజేఎస్ నేతలు విద్యార్థి తల్లిదండ్రులతో కలిసి జాయింట్ కలెక్టర్ గోవిందరాజులు ను కలిసి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థి ఆచూకీపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ, ఇంత సున్నితమైన ఘటన జరిగినప్పటికీ కాలేజీ యాజమాన్యం తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. విద్యార్థి కనిపించకుండా పోయిన విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయకపోవడం, తల్లిదండ్రులకు సకాలంలో సమాచారం ఇవ్వకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని విమర్శించారు. ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిందని కూడా వారు ఆరోపించారు.
జస్వంత్ రెడ్డి ఆచూకీని త్వరితగతిన కనుగొనడానికి పోలీసులు మరియు సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే కాలేజీ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు, హాస్టళ్లలో విద్యార్థుల భద్రతపై కఠిన మార్గదర్శకాలు అమలు చేయాలని, మిస్సింగ్ కేసులపై వెంటనే సమాచారం అందించే విధానం ఉండాలని సూచించారు. విద్యార్థి త్వరలో కనుగొనబడకపోతే తల్లిదండ్రులతో కలిసి కాలేజీ ముట్టడిస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బి. ఓబుల్ రెడ్డి, ఎన్‌ఎల్‌ఎస్‌ఏ అధ్యక్షుడు సుందర్ రాజు, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు శివ బాలాజీ, జీజేఎస్ అధ్యక్షుడు మహేంద్ర నాయక్, ఓబీసీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు విజయ్ ఉత్తరాది, బీసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ యాదవ్, చంద్రగిరి నియోజకవర్గ అధ్యక్షుడు చెంగల్రెడ్డి, మండల అధ్యక్షులు యశ్వంత్ రెడ్డి, రఫీ, వినోద్ కుమార్, శేషారెడ్డి, భార్గవ్, సోషల్ మీడియా కన్వీనర్ సెందిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.








