పార్వతీపురం, మార్చి 23: జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాల లక్ష్యాలను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం తన ఛాంబర్లో ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన గృహ నిర్మాణాల పురోగతిపై విస్తృతంగా చర్చించారు.
మండలాల వారీగా జరుగుతున్న పనులపై వివరాలు తెలుసుకున్న కలెక్టర్, ఉగాది పండుగ నాటికి పూర్తి కావాల్సిన ఇళ్లు ఇంకా పెండింగ్లో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, పనుల్లో అలసత్వం ప్రదర్శించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గృహ నిర్మాణాల పురోగతిపై పూర్తి వివరాలు సిద్ధంగా ఉంచాలని, ప్రతి దశలో జరిగిన పనులపై స్పష్టమైన నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. లబ్ధిదారులకు కేటాయించిన గృహాలపై బేస్ లెవెల్ (BL), లింటెల్ లెవెల్ (LL), రూఫ్ లెవెల్ (RL), రూఫ్ కాస్టింగ్ (RC), కంప్లీషన్ దశల వారీగా వివరాలను వెంటనే ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు అందించాలని ఆదేశించారు.
రోజువారీగా గృహ నిర్మాణాల్లో పురోగతి కనిపించాల్సిందేనని, ఒకవేళ పనులు నిలిచిపోయినట్లయితే దానికి గల కారణాలను రాతపూర్వకంగా వివరించాలని స్పష్టం చేశారు. నిర్మాణాలు మందగించిన ప్రాంతాల్లో లబ్ధిదారులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, వారిని ప్రోత్సహిస్తూ పనులను వేగవంతం చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్లు ఆర్. వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ప్రత్యేక ఉప కలెక్టర్ ఎస్. దిలీప్ చక్రవర్తి, ఇంజినీరింగ్ అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.








