రాయలసీమ ప్రాంతంలో పేదల సంక్షేమానికి కీలకంగా పనిచేస్తున్న ఆర్డీటీ సంస్థ సేవలు నిరంతరంగా కొనసాగేందుకు ఎఫ్సీఆర్ఏ (FCRA) రీన్యువల్ మంజూరు కావడం పట్ల రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కృషి వల్లే ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ రీన్యువల్ సాధ్యమైందన్నారు. రాయలసీమ ప్రాంత ప్రజలకు ఇది ఎంతో ఆనందకరమైన విషయమని పేర్కొన్నారు.
పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం, రైతుల అభివృద్ధి, వికలాంగుల సహాయం, మహిళల సాధికారత వంటి రంగాల్లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఆర్డీటీ సంస్థ కార్యకలాపాలు నిలిచిపోకుండా కొనసాగేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందనీయమని తెలిపారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపి ఎఫ్సీఆర్ఏ రీన్యువల్ సాధించడంలో కీలక పాత్ర పోషించారని వెల్లడించారు.
ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రతి సంస్థకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఇది మరోసారి రుజువు చేసిందన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రక్రియలో చేసిన కృషికి అభినందనలు తెలిపారు.
ఇదిలా ఉండగా, గత ప్రభుత్వంలో ఆర్డీటీ సేవలు నిలిచిపోయే పరిస్థితి వచ్చినప్పటికీ, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో సమన్వయం చేయలేదని విమర్శించారు. ప్రస్తుతం కొందరు వైసీపీ నాయకులు ఎఫ్సీఆర్ఏ రీన్యువల్కు తామే కారణమని చెప్పడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
త్వరలోనే ఆర్డీటీ సంస్థ ద్వారా పేదలకు గృహాలు, మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.








