కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా :పెంచికల్ పేట మండలం బొంబాయిగూడ గ్రామంలో నెలకొన్న తీవ్ర సమస్యపై “రిపోర్టర్ టీవీ” ప్రసారం చేసిన కథనంతో జిల్లా యంత్రాంగం వేగంగా స్పందించింది. గ్రామంలోని పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం మరియు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలు వర్షపు నీరు, మురుగు నీటితో నిండిపోయి చెరువులను తలపించే పరిస్థితి నెలకొన్నట్లు బుధవారం (మార్చి 18, 2026) ప్రసారమైన ప్రత్యేక కథనం వెలుగులోకి తీసుకొచ్చింది.
ఈ పరిస్థితుల వల్ల విద్యార్థులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కథనంలో వెల్లడించడంతో జిల్లా కలెక్టర్ కె. హరిత వెంటనే స్పందించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి పాఠశాల మరియు అంగన్‌వాడీ ఆవరణలో నిలిచిన నీటిని తొలగించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు.
ఈ వేగవంతమైన చర్యలతో గ్రామంలో పరిస్థితులు మెరుగుపడటంపై బొంబాయిగూడ గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను గుర్తించి వెంటనే పరిష్కరించిన జిల్లా కలెక్టర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.








