అనంతపురం జిల్లా గుత్తి పట్టణం మరియు గుత్తి ఆర్ఎస్ ప్రాంతాల్లో బుధవారం రెవెన్యూ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. తాసిల్దార్ పుణ్యవతి ఆధ్వర్యంలో రెండు బృందాలుగా విడిపోయిన సిబ్బంది పలు హోటళ్లు, దుకాణాలను తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో గృహ అవసరాల కోసం మాత్రమే ఉపయోగించాల్సిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుతున్నట్లు గుర్తించారు. దాదాపు 25 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసి మదీనా డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీకి అప్పగించారు.
ఈ సందర్భంగా తాసిల్దార్ పుణ్యవతి మాట్లాడుతూ, గృహ వినియోగానికి మాత్రమే కేటాయించిన గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, దుకాణాలు, పరిశ్రమల్లో వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నియమాలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ దాడుల్లో ఉప తాసిల్దార్ సూర్యనారాయణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, వీఆర్వోలు సురేంద్ర, బాలరాజు, పకీరప్ప, ఆంజనేయులు, సుధాకర్ రెడ్డి, ఆబు బాకర్ తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.








