తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వార్తలు పూర్తిగా అసత్యమని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, వినియోగదారులు ఎలాంటి ఆందోళనకు గురవాల్సిన అవసరం లేదని వెల్లడించింది.
ప్రభుత్వ రంగ సంస్థలైన HPCL, IOCL, BPCL వద్ద రాష్ట్ర అవసరాలకు మించిన ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని అసోసియేషన్ పేర్కొంది. కొరత అన్నది వాస్తవానికి కృత్రిమంగా ఏర్పడిన పరిస్థితి మాత్రమేనని తెలిపింది.
ఇంధనం దొరకదనే భయంతో వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్దకు చేరుకోవడం, అందరూ ‘ఫుల్ ట్యాంక్’ చేయించుకోవడం వల్ల బంకుల్లో నిల్వలు త్వరగా ఖాళీ అవుతున్నాయని వివరించింది. ఒకసారి స్టాక్ అయిపోయిన తర్వాత, డిపోల నుంచి ట్యాంకర్లు చేరుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపింది.
ఈ సమయంలో బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపించడం వల్ల ప్రజలు దానిని శాశ్వత కొరతగా భావిస్తున్నారని పేర్కొంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో తెల్లవారుజాము నుంచే బంకులు వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి.
బంక్ యజమానులు మాట్లాడుతూ, “కొరత లేదని చెప్పినా వినకుండా, ముందస్తుగా నిల్వ చేసుకోవాలనే ఆత్రుత వల్లే ఈ రద్దీ ఏర్పడుతోంది” అని వాపోతున్నారు








