తిరుపతి జిల్లా పాకాల మండలంలో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయడం, ఆస్తి సంబంధిత నేరాలను నియంత్రించడం లక్ష్యంగా పాకాల పోలీస్ స్టేషన్‌లో సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్న గోవిందు ఆధ్వర్యంలో పాన్ బ్రోకర్ షాపులు మరియు గోల్డ్ షాపుల యజమానులతో గురువారం అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ చిన్న గోవిందు మాట్లాడుతూ, ఇటీవల చోటుచేసుకుంటున్న చోరీలు, బంగారం మోసాలు వంటి నేరాలను అరికట్టడంలో వ్యాపారుల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రతి షాప్ యజమాని తమ దుకాణాల్లో నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అవి ఎప్పటికప్పుడు సక్రమంగా పనిచేసేలా నిర్వహణ చేయాలని సూచించారు.
ముఖ్యంగా షాప్ లోపలితో పాటు దుకాణం ముందు రోడ్ మరియు పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించేలా కెమెరాలను అమర్చాలని తెలిపారు. అదేవిధంగా, గోల్డ్ కుదువ పెట్టే వ్యక్తుల నుండి తప్పనిసరిగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు సేకరించి, వాటి ప్రతులను భద్రపరచుకోవాలని సూచించారు.
అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులు లేదా లావాదేవీలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వ్యాపారులు చట్టపరమైన నిబంధనలు పాటించడం ద్వారా తమ వ్యాపార భద్రతతో పాటు సమాజంలో నేరాలను తగ్గించడంలో భాగస్వాములు కావాలని సీఐ సూచించారు.
పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఎటువంటి సమస్యలు ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.
ఈ సమావేశంలో మొత్తం 15 మంది పాన్ బ్రోకర్ మరియు గోల్డ్ షాపుల యజమానులు పాల్గొన్నారు. సమావేశానికి ఎస్ఐలు తరుణ్, నాగ మంజుల, జ్యోతిరామ్ హాజరై వ్యాపారులకు పలు సూచనలు చేశారు.








