చేగుంట – తూప్రాన్ డివిజన్ : చేగుంట మండలం మక్కరాజ్పేట్ గ్రామంలోని వై జంక్షన్ ఫ్యామిలీ డాబాలో కుళ్లిపోయిన మాంసం విక్రయిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గురువారం మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ ప్రజలు కలిసి డాబాలో ఆకస్మికంగా సోదాలు నిర్వహించగా, అక్కడ నిల్వ ఉంచిన మాంసం దుర్వాసన వస్తూ కుళ్లిపోయిన స్థితిలో ఉండటాన్ని గమనించి ఆశ్చర్యానికి గురయ్యారు.
ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఇటువంటి వ్యాపారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు, గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. ఇటువంటి ఆహార పదార్థాలు విక్రయించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి డాబాపై తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గ్రామంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా క్రమం తప్పకుండా ఆహార భద్రత తనిఖీలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.








