పార్వతీపురం, జియ్యమ్మవలస మండలం: జియ్యమ్మవలస మండలంలోని పి.టి. మండ గ్రామపంచాయితీ పరిధిలోని పల్లపు సిరిపి గ్రామంలో మలేరియా కేసు నమోదవడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గ్రామానికి చెందిన నిమ్మక పార్వతి (60) అనే మహిళ మలేరియా బారిన పడిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో ‘మా ఊరికి మలేరియా వచ్చింది’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గ్రామ ప్రజలను జాగృతం చేశారు. రావాడ రామభద్రపురం వైద్యుడు డాక్టర్ దిలీప్ కుమార్, పంచాయితీ కార్యదర్శి సంతోష్ కుమార్, మలేరియా టెక్నికల్ అసిస్టెంట్ రాజశేఖర్, సచివాలయం మరియు వైద్య సిబ్బంది కలిసి గ్రామంలో విస్తృతంగా పర్యటించారు.
దోమల నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రామం మొత్తం ఏఎల్ఓ స్ప్రే చేయించడంతో పాటు కాలువలను శుభ్రపరిచి, దోమల లార్వా పెరుగుదలను అడ్డుకునేందుకు వేస్ట్ ఆయిల్, బ్లీచింగ్ పౌడర్‌ను ఉపయోగించారు. అలాగే మలేరియా లక్షణాలు, నివారణ చర్యలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.
పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం మలేరియా బారిన పడిన నిమ్మక పార్వతి చినమేరంగి పీహెచ్‌సీలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.








