మెదక్ (తూప్రాన్ డివిజన్) : మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన లైంగిక దాడి కేసులో నిందితుడిని కోర్టు దోషిగా తేల్చి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించినట్లు వెల్లడించారు.
తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జండపల్లి గ్రామానికి చెందిన సోమగారి భాస్కర్ (27) ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు అందడంతో అప్పటి ఎస్ఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు అధికారి సీఐ శ్రీధర్ సమగ్ర విచారణ జరిపి, పక్కా సాక్ష్యాధారాలను సేకరించి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.
కేసును విచారించిన న్యాయమూర్తి ఆర్.ఎం. సుభావల్లి నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధించారు. ఈ జరిమానా మొత్తాన్ని బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించినట్లు ఎస్పీ తెలిపారు.
ఈ కేసును విజయవంతంగా నడిపించడంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. బాలయ్య, భారోసా లీగల్ ఆఫీసర్ అడ్వకేట్ కే. స్వేత కీలక పాత్ర పోషించారు. తూప్రాన్ ఎస్ఐ గంగరాజు, జిల్లా లైజనింగ్ ఆఫీసర్ బి. విఠల్, పీసీలు జి. కృష్ణ, సీడిఓ నాగరాజు తదితరులు సమన్వయం చేశారు.
ఇలాంటి కేసుల్లో వేగంగా దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.








